Sunday, May 16, 2010

ద మిరకిల్ అఫ్ గివింగ్ ఫూల్ ..ఒక పిచ్చోడి కథ


అనగనగా ఒక అందమైన ఊరు...చల్లగా, అపుడపుడు మంచు చినుకులు పడుతూ ఆహ్లాదకరంగా ఉంటుందా ఊరు. ఆ ఊరిలో ఒక పిచ్చోడు ఉంటాడు. అందరూ అతన్ని అలాగే పిలుస్తారు. ఆ పిచ్చోడికి టోస్ట్ చెయ్యడం తప్ప ఇంకేమి రాదు. అతనికి అదే జీవనాధారం. ఆ ఊరిలో ఉన్న ఒక స్కూల్ ప్రక్కన చిన్న కొట్టు పెట్టుకొని టోస్ట్ లు అమ్ముతూ ఉంటాడు. స్కూల్ లో చదువుకునే పిల్లలు ఇంటర్వల్ అవ్వగానే పిచ్చోడి కొట్టుకి వచ్చి వేడి వేడిగా టోస్ట్ చేయించుకొని తింటారు. ప్రొద్దున లేచి కొట్టుకి వచ్చిన వాడు రాత్రి దాక పని చేస్తాడు. "నీవు అలసిపోవా అంతగా పని చేస్తున్నావు?" అని ఎవరు అడిగినా, ఒక నవ్వే అతని సమాధానం. ఏది అడిగినా నవ్వుతాడు, చివరికి మనం తిట్టినా కూడా...పాపం పిచ్చోడు

స్కూల్ ఇంటర్వల్ లో అందరూ పిచ్చోడి టోస్ట్ తినడానికి వస్తే, ఒక అమ్మాయి మాత్రం వాడి వైపు అసహ్యంగా చూస్తూ ఉంటుంది. ఆమె అలా చూసినప్పుడు ఇతనిలో ఏదో తెలియని బాధ. ఆమె ఎవరో కాదు అతని సొంత చెల్లెలు. పిచ్చోడు అహర్నిశలు కష్టపడేది ఆ అమ్మాయి చదువు కోసం, ఆమె భవిష్యత్తు కోసం. కానీ ఆమెకి మాత్రం తన అన్న అంటే పరమ చిరాకు. తను చదువుకునే స్కూల్ పక్కన కొట్టు పెట్టుకొని టోస్ట్ అమ్మేవాడు తన అన్నయ్య అని చెప్పుకోవడం ఆమెకి నామోషి. అందుకే ఆ విషయం ఆమె స్నేహితురాళ్లకి ఎవరికీ చెప్పదు.

ఇకపోతే పిచ్చోడు రోజూ సాయంత్రం ఆ ఊరి రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న గట్టు లాంటి ప్రదేశంలో ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉంటాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉంటాడు. అతని ఎదురుచూపులు ఫలించినట్లుగా ఒక రోజు అతను ఎదురు చూసే వ్యక్తి కనిపిస్తుంది. ఒక అందమైన అమ్మాయి. ఆ గట్టు ప్రక్కన రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంటే పిచ్చోడు ఆమె వెనకాలే వస్తాడు..ఈ అమ్మాయికి భయమేస్తుంది..వడివడిగా నడుస్తుంది..అతనూ వడివడిగా అనుసరిస్తాడు..ఒక దెగ్గర ఆమె ఆగి "ఎవరు నువ్వు ?" అనడుగుతుంది
ఒక వెర్రి నవ్వే అతని సమాధానం
అతను ప్రతిదానికి ఒక వెర్రి నవ్వే కాకుండా అపుడపుడు మాట్లాడుతుంటాడు..అది కూడా నత్తినత్తిగా..
"నువ్వు నువ్వు జీ-హో ." అంటాడు నత్తిగా
"నా పేరు నీకేలా తెలుసు..." అనడుగుతుంది ఆమె...మళ్లీ ఒక వెర్రి నవ్వు...
అలా కొద్ది సేపు ఆమె వెంట వచ్చి...ఏదో గుర్తువచ్చిన వాడిలా పారిపోతాడు...ఆమె పిలుస్తుంది..అయినా ఆగడు

ఇంటికి వెళ్ళగానే ఆమె తన తల్లికి చెపుతుంది తనని ఒక పిచ్చోడు అనుసరించాడు అని. అప్పుడు ఆమె తల్లి చెపుతుంది ఆ పిచ్చోడు నీ చిన్నప్పటి క్లాస్ మేట్ అని..ఈ అమ్మాయి నమ్మలేకపోతుంది..తరువాత ఆమె ఎప్పుడు బైటకి వెళ్ళినా ఈ పిచ్చోడు కనిపించేవాడు, ఆమెని చూసి వెంటనే పారిపోయేవాడు.

ఒక రోజు ఆమె అడుగుతుంది "ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావ్ " అని...
అతను  "నువ్వే నన్ను ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అన్నావ్ " అంటాడు.
"అవునా...అలా ఎందుకు అన్నాను..." అంటుందామె ఆశ్చర్యంగా
"నీకు ఇష్టమైన పియానో నేను తగలబెట్టాను ..అందుకని .." అంటాడు అతను భయంభయంగా..
"పర్వాలేదులే...అదెప్పుడో చిన్నప్పుడు కదా...నువ్ నాతో మాట్లాడొచ్చు...నన్ను చూడొచ్చు.." అంటుందామె
అప్పుడా పిచ్చోడి సంతోషానికి అవధులు లేవు..ఊరంతా పరిగెత్తుకుంటూ "జీ-హో నన్ను క్షమించింది.." అంటూ అరుచుకుంటూ వెళ్తాడు.ఆమె నవ్వుకుంటుంది. అతని నిష్కల్మషమైన మనస్సు ఆమెకి నచ్చుతుంది. అప్పటినుంచి అతనితో ఎంతో స్నేహంగా ఉంటుంది. చిరిగిపోయిన షూస్ వేసుకునే పిచ్చోడికి మంచి షూస్ కొనిపెడుతుంది. స్మార్ట్ గా తయారుచేస్తుంది.

పిచ్చోడికి ఇంకో స్నేహితుడు ఉంటాడు. అతనొక బార్ లో పని చేస్తూ ఉంటాడు. పిచ్చోడు అంటే అతనికి చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నపుడు తను చేసిన తప్పుకి పిచ్చోడు శిక్ష అనుభవిస్తాడు. ఆ అమ్మాయి(జీ-హో), పిచ్చోడు, అతని స్నేహితుడు (సాంగ్-సూ) అందరూ ఒకే స్కూల్ లో చదువుకొనే వాళ్ళు. జీ-హో అంటే పిచ్చోడికి చిన్నపటినుంచే చాలా ఇష్టం. ఆమెని రోజు వాళ్ళ ఇంట్లో చాటుగా చూడటం..స్కూల్ లో చాటుగా చూడటం చేస్తుంటాడు. ఒక సారి పియానో కాంపిటిషన్ లో ఆమెకి ప్లే చెయ్యడానికి రాగం దొరక్కపోతే, పిచ్చోడు బైట నుంచి గట్టి గట్టిగ ఏదో పాడుకుంటూ వెళ్తాడు, ఆ రాగం ఆమెకి స్ఫూర్తి నిచ్చి ప్లే చేస్తుంది, మొదటి బహుమతి గెల్చుకుంటుంది. ఒక రోజు పిచ్చోడు, అతని స్నేహితుడు సాంగ్-సూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో టీచర్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తూ సాంగ్-సూ తను తాగిన అర సిగరేట్ అక్కడ విసిరేసి వెళ్తాడు. ఆ రూం చెక్కతో చేసింది కాబట్టి తగలబడుతుంది. అందులో ఉన్న జీ-హో పియానో కూడా తగలబడుతుంది. ఇందంతా చేసింది పిచ్చోడే అని అందరూ పిచ్చోడినే తప్పు పడతారు. జీ-హూ అయితే తన పియానో నాశనం చేసాడు అని తిడుతుంది. అతన్ని స్కూల్ నుంచి తీసేస్తారు. ఇక్కడ సీన్ లో పిచ్చోడి తల్లి వచ్చి స్కూల్ హెడ్ మాస్టర్ తో మాట్లాడే సన్నివేసం కంటతడి పెట్టిస్తుంది "మానసికంగా ఎదగని నా కొడుకు, ఇంత పని చేసాడని మీరు నమ్ముతున్నారా...మానసిక అవిటితనం మీకు అంత అలుసుగా కనిపిస్తుందా...ఎందుకు నా కొడుకు మీదే ఇంత కక్షకట్టారు మీరంతా.." అని ఆమె అడుగుతుంటే జవాబు చెప్పలేకపోతాడు ఆ హెడ్ మాస్టర్

ఇలా ఉండగా, పిచ్చోడి చెల్లి ఓ రోజు అనారోగ్యంతో, స్కూల్ లో పడిపోతుంది. ఆ విషయం తెలిసి పిచ్చోడు పడే ఆరాటం, స్కూల్ కి వచ్చి తన చెల్లిని భుజాన వేసుకొని హాస్పిటల్ కి తీసుకువెళ్ళే సన్నివేశాలు అద్భుతం. కంటతడి పెట్టని వారుండరేమో అనిపిస్తుంది ఈ సన్నివేశాలు చూసి. అతను అలా భుజం మీద వేసుకొని వెళ్తుంటే "ఎవరు నువ్వు " అని అడుగుతారు అందరు.."నేను దీని అన్నని...నేను దీని అన్నని ..అన్నని.." అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ తీసుకెళ్తాడు. ఇక్కడ అతని నటన అద్భుతం.."నేను చనిపోయాక దాని ఆలనా పాలనా నువ్వే చూసుకోవాలి..దాన్ని నీ చేతులో తప్ప ఇంకెవరికీ అప్పగించలేను..నువ్వే దాన్ని సంతోషంగా ఉంచగాలవు" అని చనిపోయేముందు తన తల్లి అతనితో చెప్పిన మాటలు అతను పదే పదే గుర్తుచేసుకుంటాడు..

అతని చెల్లికి కిడ్నీ పాడైపోయిందని, కిడ్నీ ఎవరన్నా ఇవ్వగలిగితే ఆపరేషన్ చేస్తానని డాక్టర్ చెబుతాడు. పిచ్చోడి కిడ్నీ ఆమెకి కంపాటిబుల్  కాదు...కాని అతని ప్రాణ స్నేహితుడు సాంగ్-సూ తన కిడ్నీ పిచ్చోడి చెల్లికి ఇవ్వడానికి ముందుకొస్తాడు..

డాక్టర్ పిచ్చోడి చెల్లితో పిచ్చోడి గురుంచే చెప్పే సీన్ కూడా అధ్బుతం.."ఈ పిచ్చోడు ఏంటి...ఇంత పెద్ద హాస్పిటల్ లో నిన్ను చేర్పించి, నీకు వైద్యం చేయించడం ఏంటి అని ఆశ్చర్యపోయా...రాత్రి,పగలు అహర్నిశలు ఆ కొట్టులో సంపాదించిన డబ్బు ఇప్పుడు ఇలా నీకు వైద్యంకి ఉపయోగించాడు అని తెలుసుకొని ఆశ్చర్యపోయా..ఎంత గొప్ప మనసు అతనిది.." అంటూ చెప్పగా కన్నీళ్ళ పర్యంతం అవుతుంది పిచ్చోడి చెల్లి..

ఇక చివరిగా, సాంగ్-సూకి శత్రువు, అతన్ని చంపడానికి మనుషుల్ని పంపుతాడు.."సాంగ్-సూ చేతికి ఒక కట్టు ఉంటుంది..అతన్ని అలా గుర్తుపట్టండి " అంటాడు ఆ శత్రువు ...మన పిచ్చోడి చేతికి కూడా కట్టు ఉంటుంది, ఏదో దెబ్బ తగిలితే జీ-హో కట్టుకడుతుంది. ఒక రోజు రాత్రి పిచ్చోడు హాస్పిటల్ కి వెళ్తుండగా ఆ దుండగులు "నువ్వేనా సాంగ్-సూ " అని అడుగుతారు..వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు చూస్తాడు పిచ్చోడు ...సాంగ్-సూ బ్రతకడం ఎంత ముఖ్యమో పిచ్చోడికి తెలుసు..అతను తన ప్రాణ స్నేహితుడే కాదు, తన చెల్లెలికి మరో జన్మ ప్రసాదిస్తున్న దేవుడు..ఇక తన చెల్లెలిని తనే చూసుకుంటాడు..అందుకే పిచ్చోడు తనే సాంగ్-సూ ఒప్పుకుంటాడు...వాళ్ళు వల్ల పని కానిచ్చేసి వెళ్ళిపోతారు...పిచ్చోడు చనిపోతాడు...

అక్కడ ఉండలేక జీ-హో ఇంకో దేశం వెళ్ళిపోతుంది..సాంగ్-సూ పిచ్చోడి పెట్టిన కొట్టులోనే టోస్ట్ లు అమ్ముకుంటూ , పిచ్చోడి చెల్లెలిని తనే చూసుకుంటూ ఉంటాడు..

నేను ఈ మధ్య చూసిన చిత్రాలో ఒక అద్భుతమైన చిత్రం ఇది...ఇది కొరియన్ చిత్రం ..దీని ఇంగ్లీష టైటిల్ "ద మిరకిల్ అఫ్ గివింగ్ ఫూల్ " ..మనవ సంబంధాలని ఎంత హృద్యంగా ఆవిష్కరించిన చిత్రం. బాష వేరనే కాని, ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది..తప్పకుండ చూడవలసిన చిత్రం..ఆరు పాటలు, పదిఫైట్లు, కొన్నిద్వంద్వార్థ డైలాగులు, చీప్ కామెడి రాజ్యమేలుతున్న మన సినిమాలని చూసి విసిగి వేసారిన మనకు ఈ చిత్రం ఒక చక్కని అనుభూతిని ఇస్తుంది.

ఈ చిత్రం ట్రైలెర్ ని మీరు ఈ క్రింది వీడియోలో చూడొచ్చు 





ఈ చిత్రాన్ని చూడాలనుకుంటే, ఈ క్రింది వీడియోలో చూడండి..ఇది పదకొండు భాగాలు..మొదటి భాగం ఈ క్రింది వీడియో, అది అయిపోగానే, రెండో భాగం కనిపిస్తుంది. ఈ చిత్రం ఇంగ్లీష సుబ్-టైటిల్స్ తో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. చక్కని చిత్రాన్ని చూసి ఎంజాయ్ చెయ్యండి. మీకు తప్పకుండా నచ్చుతుందనే ఆశిస్తాను.




6 comments:

కత పవన్ said...

ఇదెదో బాగుందే...ఓసారి చుద్దాం...:)

Ram Krish Reddy Kotla said...

పవన్ గారు చాలా చక్కని చిత్రం ఇది. మీకు తప్పకుండ నచ్చుతుందనే ఆసిస్తాను :)

కవిత said...

Movie chusina feeling theppincharu kadha.Movie ni chala chakka ga chepparu...Bagundhi.Baga rasthunnaru.Ammayya,naku ila ina theater ki velle kastam thapputhundhi.Thanks andi Kishan garu...

Ram Krish Reddy Kotla said...

బంగారం గారు ధన్యవాదాలు :)..ఇంకా ఎన్ని మంచి మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొస్తాను..stay tunes

Anonymous said...

korean movie a idhi??korean movies chala sentimental ga heart touchin ga untayi..DO see A moment to remember<<one of the best movies

Ramana Murthy Venkata said...

kishan reddy ji!
please continue your work . it will be use full to cinioe lovers like me .
Don't stop !